Bible reader



1

1యూదారాజు ఆమోను కుమారుడు యోషీయా దినాల్లో జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. జెఫన్యా కూషీ కుమారుడు. కూషీ గెదల్యా కుమారుడు. గెదల్యా అమర్యా కుమారుడు. అమర్యా హిజ్కియా కుమారుడు.

యెరూషలేము పై పడబోయే తీర్పు

2“ఏమీ వదలకుండా భూమి మీద ఉన్న సమస్తాన్నీ నేను ఊడ్చివేస్తాను. ఇదే యెహోవా వాక్కు.

3మనుషులనేమి పశువులనేమి ఊడ్చివేస్తాను.

ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను నాశనం చేస్తాను. దుర్జనులను, వారి శిథిలాలను నేను ఊడ్చివేస్తాను.

భూమి మీద ఎవరూ లేకుండా మానవ జాతిని నిర్మూలం చేస్తాను.” ఇదే యెహోవా వాక్కు.

యూదా వారికి శిక్ష

4“నా హస్తాన్ని యూదా వారి మీద యెరూషలేము నివాసులందరి మీద చాపి,

బయలు దేవుడి భక్తుల్లో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులైన వారిని, దాని అర్చకులను నిర్మూలం చేస్తాను.

5మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహాలకు మొక్కే వాళ్ళను,

యెహోవా పేరును బట్టి ఒట్టు పెట్టుకుంటూ, ఆయన్ని పూజిస్తూ మిల్కోము దేవుడి1:5 దేవుడి విగ్రహం పేరు స్మరించే వారిని నాశనం చేస్తాను.

6యెహోవాను అనుసరించకుండా ఆయన్ని విసర్జించి ఆయన దగ్గర విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేస్తాను.”

7యెహోవా దినం సమీపించింది.

ఆయన బలి సిద్ధపరిచాడు.

తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించాడు.

యెహోవా ప్రభువు సన్నిధిలో మౌనంగా ఉండండి.

8“యెహోవాకు బలి అర్పించే దినాన అధిపతులను,

రాజకుమారులను విదేశీయుల్లాగా బట్టలు వేసుకునే వారందరినీ నేను శిక్షిస్తాను.

9ఇళ్ళ గడపలు దాటి వచ్చి యజమాని ఇంటిని1:9 ఇంటిని విగ్రహాలు గుడి మోసంతో బలాత్కారంతో నింపే వారిని ఆ దినాన నేను శిక్షిస్తాను.”

10ఆ రోజున చేప ద్వారంలో రోదన ధ్వని,

పట్టణం దిగువ భాగంలో అంగలార్పు వినబడుతుంది.

కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వస్తుంది.

ఇదే యెహోవా వాక్కు.

11కనానీయులంతా నాశనమయ్యారు.

డబ్బు సమకూర్చుకున్న వారందరూ నిర్మూలమైపోయారు. కాబట్టి మక్తేషు లోయ నివాసులారా, విలపించండి.

12ఆ రోజుల్లో నేను దీపాలు చేబూని యెరూషలేమును గాలిస్తాను.

పేరుకుపోయిన మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం లాంటివారై “యెహోవా మేలుగానీ కీడుగానీ చేసేవాడు కాడు” అని మనస్సులో అనుకొనే వారిని శిక్షిస్తాను.

13వారి ఆస్తి దోపుడు సొమ్ముగా అవుతుంది.

వారి ఇళ్ళు పాడైపోతాయి.

వారు ఇళ్ళు కట్టుకుంటారు గాని వాటిలో కాపురముండరు.

ద్రాక్షతోటలు నాటుతారు గాని వాటి రసం తాగరు.

మహా ఉగ్రతా దినం

14యెహోవా మహా దినం దగ్గర పడింది.

యెహోవా దినం సమీపంగా ఉంది. అతి శీఘ్రంగా వస్తూ ఉంది.

వినండి. యెహోవా దినం వచ్చేస్తోంది.

పరాక్రమశాలురు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు.

15ఆ దినం ఉగ్రత దినం. బాధ, ఉపద్రవం మహానాశనం కమ్ముకు వచ్చే దినం.

అంధకారం, మసక కమ్మే రోజు.

మేఘాలు ముసిరి గాఢాంధకారం పొదిగే రోజు.

16ఆ దినాన ప్రాకారాలున్న పట్టణాల దగ్గర, ఎత్తయిన గోపురాల దగ్గర, యుద్ధ ఘోష, భేరీనాదం వినబడుతాయి.

17ప్రజలు యెహోవా దృష్టికి పాపం చేశారు గనక నేను వారి మీదికి ఉపద్రవం రప్పించబోతున్నాను.

వారు గుడ్డివారిలాగా నడుస్తారు.

వారి రక్తం దుమ్ములాగా ఒలికిపోతుంది.

వారి మాంసాన్ని పెంటలాగా పారేస్తారు.

18యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేకపోతాయి.

రోషాగ్నిచేత భూమంతా దహనం అవుతుంది.

హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వ నాశనం చేయబోతున్నాడు.