సంఖ్యా కాండము
గ్రంథకర్త
సర్వజనీనంగా యూదు, క్రైస్తవ సంప్రదాయాలు సంఖ్యాకాండం గ్రంథ కర్తృత్వాన్ని మోషేకు ఆపాదించాయి. ఈ పుస్తకంలో అనేక గణాంకాలు, జనాభా లెక్కలు, గిరిజన, యాజక వివరాలు ఉన్నాయి. ఈజిప్టునుంచి నిర్గమనం తరువాత 2 వ సంవత్సరం నుండి 40 వ సంవత్సరం వరకు 38 సంవత్సరాల కాలాన్ని ఈ గ్రంథం వివరిస్తున్నది. అంటే సీనాయి దగ్గర విడిసి ఉన్న సమయం మొదలుకొని, కొత్త తరం వాగ్దాన భూమిలో ప్రవేశించే దాకా. అంతే గాక నిర్గమం తరువాత రెoడవ, నలభయ్యవ సంవత్సరాల్లో జరిగిన వాటికే ఈ గ్రంథం ప్రాధాన్యతనిచ్చింది. మధ్యలో వారు అరణ్య సంచారం చేసిన 38 సంవత్సరాల గురించి పెద్దగా సమాచారం లేదు.
రచనా కాలం, ప్రదేశం
ఇంచుమించు క్రీ. పూ 1445 - 1400
ఇశ్రాయేలీయులు ఈజిప్టు వదిలి వచ్చిన రెండవ సంవత్సరం అంటే ప్రజానీకం సీనాయి కొండవద్ధ ఉన్న సమయం (1:1).
స్వీకర్త
వాగ్దాన దేశానికి ఇశ్రాయేలీయుల ప్రయాణాన్ని గ్రంథస్థం చేయడానికి ఆ ప్రజల కోసం రాసిన గ్రంథమిది. అంతే గాక దేవుని ప్రజల పరలోక ప్రయాణంలో ఆయన వారిలో ఉంటాడని ఈ గ్రంథం తెలుపుతున్నది.
ప్రయోజనం
రెండవ తరం వాగ్దాన దేశంలోకి ప్రవేశించటానికి సిద్ధమైన తరుణంలో మోషే సంఖ్యాకాండం రాశాడు. (సంఖ్యా 33:2). దేవుని వాగ్ధానాన్ని విశ్వాసంతో స్వంతం చేసుకొమ్మని ఆ తరాన్ని ప్రోత్సహించడం ఈ గ్రంథం ఉద్దేశం. దేవుని షరతులు లేని నమ్మకత్వాన్ని కూడా సంఖ్యాకాండం వెల్లడిస్తుంది. మొదటి తరం నిబంధన ఆశీర్వాదాలను తిరస్కరించగా దేవుడు మాత్రం తన నిబంధనకు కట్టుబడే ఉన్నాడు. ప్రజల ఫిర్యాదులు, తిరుగుబాటులు అలా ఉన్నప్పటికి ఆయన ఆ జాతిని దీవిస్తూనే, రెండవ తరానికి ఆ దేశాన్ని ఇస్తానన్న వాగ్ధానానికి కట్టుబడే ఉన్నాడు.
ముఖ్యాంశం
ప్రయాణాలు
విభాగాలు
1. వాగ్దాన దేశం ప్రయాణ సన్నాహాలు — 1:1-10:10
2. సీనాయి నుండి కాదేషుకు ప్రయాణం — 10:11-12:16
3. తిరుగుబాటు మూలంగా ఆలస్యం — 13:1-20:13
4. కాదేషుకు నుండి మోయాబు మైదాన భూమికి ప్రయాణం — 20:14-22:1
5. మోయాబులో ఇశ్రాయేల్ వాగ్దాన భూమి ఆక్రమణకు సన్నాహాలు — 22:2-32:42
6. వివిధ అంశాల నిర్వహణ — 33:1-36:13
