Bible reader



నహూము

గ్రంథకర్త

గ్రంథకర్త తన పేరును నహూముగా పేర్కొన్నాడు (హీబ్రూలో ఈ పేరుకు అర్ధం “ఓదార్చేవాడు, ఆదరించే వాడు”). ఇతడు ఎల్కోషు ఊరివాడు (1:1). ప్రవక్తగా దేవుడు ఇతన్ని అషురు ప్రజల, ముఖ్యంగా వారి రాజధాని నీనెవే పశ్చాత్తాపం కోసం పంపాడు. యోనా సందేశం విని వారు పశ్చాత్తాపపడినది దీనికి 150 సంవత్సరాలకు ముందు, కాబట్టి ఆ ప్రజలు మరలా గతంలోని తమ విగ్రహ పూజలకు తిరిగిపోయారని అర్ధమవుతున్నది.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. పూ. 663 - 612

నహూము గ్రంథ రచన కాలాన్ని తేలికగానే నిర్ణయించవచ్చు. తేబేను నగర విధ్వంసం, నీనెవె పతనం అనే రెండు ప్రధాన చారిత్రిక అంశాల మధ్య కాలంలో పుస్తక రచన జరిగింది.

స్వీకర్త

ఉత్తర ఇశ్రాయేలు రాజ్యాన్ని ఓడించి చెరపట్టి తీసుకుపోయిన అషురు వారికి దేవుడు ఈ గ్రంథంలోకి సందేశం పంపిస్తున్నాడు. అంతేగాక తమకూ అదే గది పడుతుందేమోనని భయపడుతున్న దక్షిణ యూదా సామ్రాజ్యానికి కూడా ఇందులో సందేశం ఉంది.

ప్రయోజనం

దేవుని తీర్పు న్యాయమైనది, అది తప్పకుండా వస్తుంది. కొంత కాలం పాటు కనికరం చూపాలని ఆయన నిర్ణయించుకున్నట్టయితే, ఆయన ఆవిధంగా ఆగడం ఆయన అంతిమన్యాయ తీర్పుకు అడ్డు రాదు. దేవుడు 150 సంవత్సరాలకు ముందే వారి వద్దకు యోనా ప్రవక్తను పంపించాడు. వారు తమ దుర్మార్గాల్లో కొనసాగితే ఏమి జరుగుతుందో హెచ్చరించాడు. ఆ కాలంలో ప్రజలు పశ్చాత్తాప పడ్డారు. కాని ప్రస్తుతం అంతకు ముందుకన్నా అధ్వాన్నమైన స్ధితిలో ఉన్నారు. అష్హురు వారు తాము ఓడించిన రాజ్యాల పట్ల అత్యంత కౄరంగా ప్రవర్తించేవారు. ఇప్పుడు నహూము యూదా ప్రజలతో భయపడవద్దని చెబుతున్నాడు. ఎందుకంటే దేవుడు తన తీర్పును ప్రకటించాడు. అష్హురు వారికి తగిన శిక్ష వారి మీదకి వస్తుంది.

ముఖ్యాంశం

ఓదార్పు

విభాగాలు

1. దేవుని తేజస్సు — 1:1-14

2. దేవుని తీర్పు, నీనెవె — 1:15-3:19