Bible reader



మీకా

గ్రంథకర్త

మీకా గ్రంథ రచయిత మీకా ప్రవక్త (1:1). ఇతడు పల్లెటూరి వాడు. నగరానికి వెళ్ళి ఆ ప్రజల సామాజిక ఆధ్యాత్మిక అన్యాయాలు, విగ్రహ పూజలు మూలంగా వారి మీదకి ముంచుకు రానున్న తీర్పును గురించి దైవ సందేశాన్ని ప్రకటించాడు. దేశంలో వ్యవసాయ ప్రధానమైన ప్రాంతంలో ఇతడు నివసించాడు. దేశంలోని ప్రభుత్వ కేంద్రాలకు దూరాన ఇతని నివాసం. ఆ విధంగా తన జాతిలో అణగారిపోయిన నిర్భాగ్యుల విషయం ఇతడు చింతించాడు. అంగవైకల్యం గలవారు, వెలివేతకు గురైన వారు, బాధితులు మొదలైన వారి పక్షం వహించాడు (4:6). పాతనిబంధనలో కెల్లా యేసు పుట్టుక గురించిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రవచనం మీకాలో ఉంది. ఆయన పుట్టుకకు 700 సంవత్సరాలకు ముందే ఆయన పుట్టబోయే ఊరు, ఆయన నిత్యత్వం గురించి మీకా ప్రవచించాడు (5:2).

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. పూ. 735 - 700

మీకా మొదటి ప్రవచనాలు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యపతనానికి కొద్దిగా ముందు వచ్చాయి (1:2-7). ఇతర ప్రవచనాలు బబులోను చెర కాలంలో, మరికొన్ని ప్రవాసులు స్వదేశం తిరిగి వచ్చాక రాయడం జరిగింది.

స్వీకర్త

ఉత్తర ఇశ్రాయేల్ ప్రజలకు, దక్షిణ యూదా ప్రజలకు కూడా మీకా రాశాడు.

ప్రయోజనం

మీకా ప్రవచనాలు రెండు ప్రాముఖ్యమైన భవిషత్తు వాక్కులు చుట్టు కేంద్రీకృతం అయినాయి. ఒకటి ఇశ్రాయేల్, యూదాలపై తీర్పు (1:1-3:12). రెండవది వెయ్యేళ్ళ పాలనలో దేవుని ప్రజల ప్రాభవం (4:1-5:16). తన ప్రజల పక్షంగా దేవుడు తాను చేసిన ఉపకారాలను వారికి గుర్తు చేస్తున్నాడు. వారు తమ సంగతి తాము చూసుకుంటే తాను వారి కోసం ఎలా శ్రద్ధ చూపాడో చెబుతున్నడు.

ముఖ్యాంశం

దైవ తీర్పు.

విభాగాలు

1. ముంచుకు వస్తున్న దైవ తీర్పు — 1:1-2:13

2. వినాశనం గురించి సందేశం — 3:1-5:15

3. ప్రజల దోషాన్ని రుజువు చేసే సందేశం — 6:1-7:10

4. ఉపసంహారం — 7:11-20