Bible reader



మత్తయి రాసిన సువార్త

గ్రంథకర్త

ఈ పుస్తక రచయిత మత్తయి పన్ను వసూలుచేసే ఉద్యోగి. అతడు ఆ పని వదిలి పెట్టి యేసును వెంబడించాడు. (9:9-13). మార్కు, లూకా, తమ గ్రంథాల్లో ఇతన్ని “లేవీ” గా పేర్కొంటారు. మత్తయి అనే పేరుకు అర్థం “యెహోవా బహుమానం.” అది సంఘ పితరులు మత్తయి సువార్తను 12 మంది అపోస్తలుల్లో ఒకడైన మత్తయి రాశాడని అంగీకరించారు. యేసు పరిచర్య సంఘటనలకు మత్తయి ప్రత్యక్ష సాక్షి. మత్తయి సువార్తలోని విషయాలను ఇతర సువార్తలతో పోల్చి చూస్తే క్రీస్తును గురించిన అపోస్తలుల సాక్షం పరస్పరం భిన్నంగా లేదని అర్థమౌతుంది.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. శ. 65 - 70

మత్తయి సువార్తలో కనిపించే యూదు ధోరణిని బట్టి దీన్ని బహుశా పాలస్తీనాలో గానీ సిరియాలో గానీ రాసి ఉండవచ్చు. కొందరు గ్రంథ రచన అంతియొకయలో జరిగింది అంటారు.

స్వీకర్త

ఈ సువార్తను గ్రీసు భాషలో రాశారు గనక మత్తయి యూదు సమాజంలో గ్రీసు భాష మాట్లాడే వారి వైపు మొగ్గు చూపినట్టు అనిపిస్తున్నది. ఇందులోని అనేక అంశాలు యూదుల కోసం రాసినట్టు రుజువు చేస్తున్నాయి. పాత నిబంధన నెరవేర్పు గురించి మత్తయి పట్టించుకోవడం, యేసు వంశావళిని అబ్రాహాము నుండి ఏకరువు పెట్టడం (1:1-17), యూదుల పరిభాష వాడకం (ఇక్కడ “పరలోక” అని వాడడానికి కారణం యూదులు దేవుడు అనే శబ్దం వాడేందుకు ఇష్టపడేవారు కాదు). యేసును దావీదు కుమారుడు అనడం కూడా ఇందుకే. (1:1; 9:27; 12:33; 15:22; 20:30-31; 21:9, 15; 22:41-45). ఈ కారణాలను బట్టి మత్తయి యూదు సమాజం కోసం ఈ పుస్తకం రాశాడని రుజువౌతున్నది.

ప్రయోజనం

ఈ పుస్తకం రాయడంలో మత్తయి ఉద్దేశం తన యూదు పాఠకులు యేసును మెస్సియగా అంగీకరించాలన్నదే. ఇక్కడ దేవుని రాజ్యాన్ని మానవుల చెంతకు తేవడం అనే దానిపై మత్తయి దృష్టి సారించాడు. యేసు పాతనిబంధన ప్రవచనాలను, ఎదురుతెన్నులను నెరవేర్చే రాజు అనే సంగతిని మత్తయి నొక్కి చెబుతున్నాడు.

ముఖ్యాంశం

యేసు, యూదుల రాజు.

విభాగాలు

1. యేసు జననం — 1:1-2:23

2. యేసు గలిలయ పరిచర్య — 3:1-18:35

3. యేసు యూదయ పరిచర్య — 19:1-20:34

4. యూదయలో చివరి దినాలు — 21:1-27:66

5. అంతిమ సంభవాలు — 28:1-20