Bible reader



యెహోషువా

గ్రంథకర్త

యెహోషువ గ్రంథంలో దాని రచయిత పేరు స్పష్టంగా ప్రస్తావించినట్టు కనిపించదు. అయితే మోషే తదనంతరం ఇశ్రాయేల్ పై నాయకుడుగా అయిన నూను కుమారుడు యెహోషువ ఈ పుస్తకం రాసి ఉండవచ్చు. గ్రంథంలో చివర భాగం యెహోషువ మరణానంతరం వేరొక వ్యక్తి రాసి ఉంటాడు. యెహోషువ చనిపోయాక చాలా భాగాలు ఎడిట్ చేయడం, రాసి ఉండటం జరిగి ఉంటుంది. ఈ గ్రంథంలో మోషే మరణం తరువాత యెహోషువ నాయకత్వంలో వాగ్దానదేశాన్ని స్వాధీనపరుచుకున్న కాలం వివరాలు ఉన్నాయి.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. పూ. 1400 - 1176

యెహోషువ కనానును స్వాధీనం చేసుకున్న సందర్భంలో అక్కడే గ్రంథరచన జరిగింది.

స్వీకర్త

ఇశ్రాయేల్ ప్రజానీకం, తరువాత కాలంలో బైబిల్ పాఠకులందరి కోసం యెహోషువ గ్రంథ రచన జరిగింది.

ప్రయోజనం

దేవుడు వాగ్దానం చేసిన భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి చేసిన సైనిక దాడుల స్థూలవివరాలను యెహోషువ గ్రంథం అందిస్తున్నది. ఈజిప్టు నిర్గమనం, 40 సంవత్సరాల అరణ్య ప్రయాణాల తరువాత కొత్తగా ఏర్పడిన జాతి ఇప్పుడు వాగ్దానదేశంలో ప్రవేశించటానికి, అక్కడి జాతులను ఓడించి ఆ ప్రదేశాలను ఆక్రమించుకోవటానికి సిద్ధంగా ఉంది. నిబంధన క్రింద ఉన్న ఈ ఎన్నికైన జాతి వాగ్దానదేశంలో ఏవిధంగా స్థిరపడ్డారో యెహోషువ గ్రంథం వర్ణిస్తున్నది. పితరులకు తాను చేసిన నిబంధన పట్ల యెహోవాకు ఉన్న నిబద్ధత, సీనాయి వద్ద మొదట తాను చేసిన ఆ నిబంధనకు ఆయన కట్టుబడి ఉండడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. నిబంధన పట్ల అంకిత భావం, ఐక్యత, రానున్న తరాల్లో ఉన్నత నైతిక విలువలు ఆ ప్రజల్లో నెలకొని ఉండేలా ఈ లేఖన భాగం వారికి ప్రేరణగా ఉంటుంది.

ముఖ్యాంశం

ఆక్రమణ

విభాగాలు

1. వాగ్దాన దేశ ప్రవేశం — 1:1-5:12

2. దేశాన్ని స్వాధీనం చేసుకోవడం — 5:13-12:24

3. దేశాన్ని పంచుకోవడం — 13:1-21:45

4. గోత్రాల ఐక్యత, యెహోవా పట్ల స్వామిభక్తి — 22:1-24:33