Bible reader



న్యాయాధిపతులు

గ్రంథకర్త

న్యాయాధిపతులు వాచకంలో ఈ పుస్తకం ఎవరు రాశారన్న ఆధారాలు కనిపించవు. అయితే యూదుల సంప్రదాయ గాథలను బట్టి సమూయేలు ప్రవక్త రాశాడని తెలుస్తున్నది. సమూయేలు చివరి న్యాయాధిపతి. న్యాయాధిపతులు గ్రంథకర్త రాజరిక వ్యవస్థ ఆరంభ దినాల్లో జీవించిన విషయం స్పష్టమే. “ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు” (న్యాయాధి 17:6; 18:1; 19:1; 21:25) అనే మాటలు పదే పదే రావడం ఈ గ్రంథరచన జరిగిన కాలానికీ ఈ గ్రంథంలో ఉన్న పరిస్థితులకూ ఉన్న తేడాను గురుతు చేస్తున్నాయి. “న్యాయాధిపతులు” అంటే “రక్షకులు” అని అర్ధం. న్యాయాధిపతులు అంటే స్థూలంగా ఇశ్రాయేల్ జాతిని విదేశీ శత్రువుల నుండి విడిపించిన వారు. వీరు కొంతమందైనా పాలకులుగా వివాదాలు పరిష్కరించిన వారుగా వ్యవహరించారు.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. పూ. 1550 - 1025

మధ్యకాలం. బహుశా దావీదు పరిపాలన కాలంలో గ్రంథ రచన జరిగింది అని చెప్పవచ్చు. మానవ పరంగా ఈ గ్రంథరచన వెనుక ఉన్న ఉద్దేశం యెహోషువా మరణ సమయం నుండి నెలకొని ఉన్న అస్తవ్యస్థమైన పద్దతులు కన్నా రాజరిక వ్యవస్థ మెరుగని నిరూపించడమే.

స్వీకర్త

ఇశ్రాయేల్ ప్రజలు, భవిష్యతులో చదివే వారంతా.

ప్రయోజనం

కనాను దేశం స్వాధీన కాలం నుండి ఇశ్రాయేల్ మొదటి రాజు వరకు ఆ జాతి చరిత్రను ఆవిష్కరించడం. కేవలం ఉన్నదున్నట్టుగా చరిత్రను తెలియజెప్పడం కాదు గానీ న్యాయాధిపతుల కాలంలో దేవజ్ఞాన దృష్టిని (24:14-28; 2:6-13) గ్రంథస్తం చేయడం ఈ గ్రంథం ఉదేశం. యెహోవా తాను అబ్రాహాముకు చేసిన నిబంధనకు ఏ విధంగా నమ్మకంగా ఉన్నాడో తెలియజేయడం, ప్రజలు ఆ నిబంధనను వమ్ము చేసినప్పటికీ యెహోవా మాత్రం తన నిబంధనకు కట్టుబడి ఉంటాడని చెప్పడం గ్రంథం ఉద్దేశం. ప్రతి తరంలోనూ దేవుడు దుర్మార్గంలో పోరాడేందుకు ఎవరో ఒకరిని (ఆది 3:15) లేపుతున్నట్టయితే అప్పటికి పూ ర్తి అయిన తరాలెన్నో న్యాయాధిపతుల సంఖ్య కూడా అన్ని ఉండాలి.

ముఖ్యాంశం

శైథిల్యం, విడుదల.

విభాగాలు

1. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేల్ ప్రజల స్థితిగతులు — 1:1-3:6

2. ఇశ్రాయేల్ న్యాయాధిపతులు — 3:7-16:31

3. ఇశ్రాయేలీయుల పాపాలను ప్రదర్శించే సంఘటనలు — 17:1-21:25