Bible reader



41

ఇశ్రాయేలుకు సహాయకుడైన దేవుడు

1“ద్వీపాల్లారా, నా ఎదుట మౌనంగా ఉండి వినండి. జాతులు వచ్చి నూతన బలం పొందండి.

వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడాలి. రండి, మనం కలిసి చర్చించి వివాదం తీర్చుకుందాం.

2నీతియుతమైన పరిచర్య జరిగించే ఇతణ్ణి తూర్పు నుండి ప్రేరేపించి 41:2 నీతియుతమైన పరిచర్య జరిగించే ఇతణ్ణి తూర్పు నుండి ప్రేరేపించి పర్షియా రాజు కోరెషు, యెషయా 45:1 చూడండిపిలిచిన వాడెవడు?

ఆయన అతనికి రాజ్యాలను అప్పగిస్తున్నాడు, రాజులను అతనికి లోబరుస్తున్నాడు.

అతని ఖడ్గానికి వారిని ధూళిలాగా అప్పగిస్తున్నాడు.

అతని విల్లుకి వారిని ఎగిరిపోయే పొట్టులాగా అప్పగిస్తున్నాడు.

3అతడు వారిని తరుముతున్నాడు.

తాను ఇంతకుముందు వెళ్ళని దారైనా సురక్షితంగా దాటిపోతున్నాడు.

4దీన్ని ఎవడు ఆలోచించి జరిగించాడు?

ఆదినుండి మానవ జాతులను పిలిచిన వాడినైన యెహోవా అనే నేనే.

నేను మొదటివాడిని, చివరి వారితో ఉండేవాణ్ణి.

5ద్వీపాలు చూసి దిగులు పడుతున్నాయి.

భూదిగంతాలు వణకుతున్నాయి, ప్రజలు వచ్చి చేరుకుంటున్నారు.

6వారు ఒకడికొకడు సహాయం చేసుకుంటారు.

‘ధైర్యంగా ఉండు’ అని ఒకడితో ఒకడు చెప్పుకుంటారు.

7‘అది బాగా ఉంది’ అని చెబుతూ శిల్పి కంసాలిని ప్రోత్సాహపరుస్తాడు.

సుత్తెతో నునుపు చేసేవాడు దాగలి మీద కొట్టేవాణ్ణి ప్రోత్సాహపరుస్తాడు

ఆ విగ్రహం కదిలిపోకుండా వారు మేకులతో దాన్ని బిగిస్తారు.

8నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఎన్నుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,

9భూదిగంతాల నుండి నేను నిన్ను తీసుకువచ్చాను. దూరంగా ఉన్న అంచుల నుండి నిన్ను పిలిచాను.

10నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

11నీ మీద కోపపడే వారంతా సిగ్గుపడి, అవమానం పాలవుతారు.

నిన్ను ఎదిరించే వారు కనబడకుండా నశించిపోతారు

12నువ్వెంత వెదికినా నీతో కలహించే వారు కనిపించరు.

నీతో యుద్ధం చేసే వారు లేకుండా పోతారు, పూర్తిగా మాయమైపోతారు.

13నీ దేవుణ్ణి అయిన యెహోవా అనే నేను, ‘భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను’ అని చెబుతూ నీ కుడిచేతిని పట్టుకున్నాను.

14పురుగులాంటి యాకోబూ, అల్పమైన ఇశ్రాయేలూ, ‘భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను’” అని యెహోవా సెలవిస్తున్నాడు.

ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే నీ విమోచకుడు.

15“ఇదిగో చూడు, నిన్ను పదునైన కొత్త నూర్పిడి బల్లగా నియమించాను.

నువ్వు పర్వతాలను నూర్చి, వాటిని పొడి చేస్తావు. కొండలను పొట్టులాగా చేస్తావు.

16నువ్వు వాటిని ఎగరేసినప్పుడు గాలికి అవి కొట్టుకుపోతాయి. సుడిగాలికి అవి చెదరిపోతాయి.

నువ్వు యెహోవాను బట్టి సంతోషిస్తావు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి అతిశయపడతావు.

17దీనులు, అవస్థలో ఉన్నవారు నీటి కోసం వెదుకుతున్నారు. నీళ్లు దొరక్క వారి నాలుక దప్పికతో ఎండిపోతున్నది.

యెహోవా అనే నేను వారికి జవాబిస్తాను. ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడిచిపెట్టను.

18ఇది యెహోవా చేతి కార్యమనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే దీన్ని కలిగించాడనీ మనుషులు గ్రహించి స్పష్టంగా తెలుసుకుంటారు.

19నేను చెట్లు లేని ఎత్తు స్థలాల మీద నదులను పారిస్తాను. లోయల మధ్యలో ఊటలు ఉబికేలా చేస్తాను.

అరణ్యాన్ని నీటి మడుగుగా, ఎండిపోయిన నేలను నీటిబుగ్గలుగా చేస్తాను.

20నేను అరణ్యంలో దేవదారు వృక్షాలు, తుమ్మచెట్లు, గొంజిచెట్లు, తైలవృక్షాలు నాటిస్తాను.

ఎడారిలో తమాల వృక్షాలు, సరళ వృక్షాలు, నేరేడు చెట్లు నాటిస్తాను.

21మీ వాదంతో రండి” అని యెహోవా అంటున్నాడు. “మీ రుజువులు చూపించండి” అని యాకోబు రాజు చెబుతున్నాడు.

22జరగబోయే వాటిని విశదపరచి మాకు తెలియజెప్పండి.

గతంలో జరిగిన వాటిని మేం పరిశీలించి వాటి ఫలాన్ని తెలుసుకునేలా వాటిని మాకు తెలియజెప్పండి.

23ఇకముందు జరగబోయే సంగతులను తెలియజెప్పండి.

అప్పుడు మీరు దేవుళ్ళని మేం ఒప్పుకుంటాం.

మేము విస్మయం చెందేలా మేలైనా, కీడైనా, ఏదైనా పని చేయండి.

24మీకు ఉనికి లేదు. మీ పనులు శూన్యం. మిమ్మల్ని ఆశించేవారు అసహ్యులు.

25ఉత్తరదిక్కు నుండి నేనొకణ్ణి పురిగొల్పుతున్నాను. అతడు నా పేరున ప్రార్థిస్తాడు.

అతడు సూర్యోదయ దిక్కునుండి వచ్చి ఒకడు బురద తొక్కే విధంగా, కుమ్మరి మన్ను తొక్కే విధంగా రాజులను అణగదొక్కుతాడు.

26జరిగినదాన్ని మొదటి నుండి మాకు చెప్పి మమ్మల్ని ఒప్పించినవాడేడీ?

“అతడు చెప్పింది సరైనదే” అని మేము చెప్పేలా పూర్వకాలంలో దాన్ని మాకు చెప్పింది ఎవరు?

ఎవరూ వినిపించలేదు, వినడానికి మీరెవరికీ చెప్పలేదు.

27వినండి, “ఇదిగో, ఇవే అవి” అని మొదట సీయోనుతో నేనే చెప్పాను.

యెరూషలేముకు సందేశం ప్రకటించడానికి నేనే ఒకణ్ణి పంపించాను.

28నేను చూసినప్పుడు ఎవ్వరూ లేరు. నేను వారిని ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పడానికి, మంచి సలహా ఇవ్వడానికి ఎవరూ లేరు.

29వారంతా మోసగాళ్ళు. వారు చేసేది మాయ. వారి విగ్రహాలు శూన్యం. అవి వట్టి గాలిలాంటివి.