Bible reader



గలతీయులకు రాసిన పత్రిక

గ్రంథకర్త

ఈ పత్రిక రచయిత అపోస్తలుడు పౌలు. అది సంఘంలో ఇది ఏకగ్రీవ అంగీకారం పొందిన సత్యం. ఆసియా మైనర్ లో పౌలు తన మిషనెరీ ప్రయాణంలో అతడు ఇక్కడ కొన్ని సంఘాలు స్థాపించాడు. వాటికి ఈ పత్రిక రాశాడు. గలతియ కూడా రోమ్, కొరింతు లాగా ఒక నగరం కాదు. అనేక నగరాలూ సంఘాలూ ఉన్న ఒక రాష్ట్రం. ఈ ఉత్తరం అందుకున్న వారు పౌలు మూలంగా ప్రభువును నమ్మారు.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. శ. 49 - 57

పౌలు బహుశా అంతియొకయ నుండి గలతియ క్రైస్తవులకు ఈ పత్రిక రాశాడు. అంతియొకయ అతని నివాస స్థలం.

స్వీకర్త

గలతియ ప్రాంతంలోని అనేక సంఘాలకు పౌలు రాశాడు.

ప్రయోజనం

యూదు మతబోధకుల కపట సువార్తను ఖండించడం ఈ పత్రిక ఉద్దేశం. ఈ యూదు బోధకులు రక్షణ కోసం సున్నతి కూడా అవసరమని నేర్పించారు. రక్షణకు అసలైన పునాది గురించి గలతియులకు తెలియజెప్పడానికి పౌలు ఈ పత్రిక రాశాడు. పౌలు తన అపోస్తలిక అధికారాన్ని స్థాపిస్తూ తాను బోధించిన సువార్తను సమర్థించాడు. కృప ద్వారా విశ్వాసం మూలంగా మాత్రమే మనుషులు నిర్దోషులుగా తీర్చబడతారు. వారు కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే, ఆత్మ ఇచ్చే స్వేచ్చానుసారంగా మాత్రమే తమ నూతన జీవితాలు గడపాలి.

ముఖ్యాంశం

క్రీస్తులో స్వాతంత్ర్యం.

విభాగాలు

1. పరిచయం — 1:1-10

2. సువార్త నిర్ధారణ — 1:11-2:21

3. విశ్వాసం మూలంగా నిర్దోషులుగా తీర్చబడడం — 3:1-4:31

4. విశ్వాసయుతమైన స్వేచ్చాపూరితమైన జీవిత అభ్యాసం — 5:1-6:18