Bible reader



22

దావీదు స్తుతిగీతం

1యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు.

అతడిలా ప్రార్థించాడు.

2యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు.

3నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను.

నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం.

హింస నుండి నన్ను కాపాడేవాడు.

4స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను.

నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను.

5మృత్యుకెరటాలు నన్ను చుట్టుకున్నాయి.

భక్తిహీనుల వరద పొంగు నన్ను ముంచెత్తింది.

6పాతాళ22:6 పాతాళ చనిపోయిన వారి ప్రదేశం పాశాలు నన్ను కట్టి వేశాయి.

మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి.

7నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను.

నా దేవునికి విన్నవించుకున్నాను.

ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు.

నా మొర్ర ఆయన చెవులకు చేరింది.

8అప్పుడు భూమి కంపించింది. అదిరింది.

పరమండలపు పునాదులు వణికాయి.

ఆయన కోపానికి అవి కంపించాయి.

9ఆయన ముక్కుపుటాల్లో నుంచి నుండి పొగ లేచింది.

ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి.

అవి నిప్పు కణాలను రగిల్చాయి.

10ఆకాశాన్ని చీల్చి ఆయన దిగి వచ్చాడు

ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది.

11ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు.

గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు.

12అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు.

దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు.

13ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి.

14యెహోవా ఆకాశం నుండి గర్జించాడు.

సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు.

15తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు.

ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు.

16యెహోవా యుధ్ధ ధ్వనికి

ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి

భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి.

17పైనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు.

నురగలు కక్కుతున్న జలరాసుల్లో నుండి నన్ను బయటికి తీశాడు.

18బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారినిండి,

నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు.

19విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు.

కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు.

20యెహోవా విశాలమైన చోటికి నన్ను తోడుకుని వచ్చాడు.

నేనంటే ఆయనకు ఇష్టం గనక ఆయన నన్ను రక్షించాడు.

21నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు.

నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు పూర్వ క్షేమ స్థితి కలిగించాడు.

22ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను.

నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు.

23ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి.

ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగ లేదు.

24ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను.

పాపానికి దూరంగా ఉన్నాను.

25నా నీతినిబట్టి యెహోవా నాకు పూర్వ క్షేమస్థితి కలిగించాడు

తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు.

26నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు.

యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు.

27నిష్కళంకుల యెడల నీవు నిష్కళంకంగా ఉంటావు.

వక్ర బుద్ది గలవారి యెడల వికటంగా ఉంటావు.

28యాతన పడే వారిని రక్షిస్తావు

గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేస్తావు.

29యెహోవా, నీవు నాకు దీపం.

యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చు.

30నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను22:30 అధిగమిస్తాను అణిచివేస్తాను.

నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను.

31దేవుని మార్గం పరిపూర్ణం

యెహోవా వాక్కు నిర్మలం

ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు.

32యెహోవా తప్ప దేవుడేడి?

మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?

33దేవుడు నాకు బలమైన కోట.

ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు.

34ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు.

పర్వతాలపై నన్ను నిలుపుతాడు.

35నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే

నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెడతాయి.

36నీవు నీ రక్షణ డాలును నాకు అందిస్తావు.

నీ అనుగ్రహం నన్ను గొప్పచేస్తుంది.

37నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు.

అందువల్ల నా కాళ్ళు జారవు.

38నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను.

వారిని నాశనం చేసేదాకా నేను వెనుదిరగను.

39నేను వారిని మింగి వేశాను. ముక్కలుచెక్కలు చేశాను. వారిక లేవలేరు.

వారు నా కాళ్ళ కింద ఉన్నారు.

40నడికట్టు బిగించి కట్టినట్టు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపజేస్తావు.

నా మీదికి లేచిన వారిని నీవు అణచివేస్తావు.

41నా శత్రువుల మెడలను నా ముందు వంచావు.

నన్ను ద్వేషించే వారిని నేను సమూలనాశనం చేస్తాను.

42వారు సహాయం కోసం అరిచారు. కానీ రక్షించే వాడు ఎవడూ లేడు.

వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు.

43నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను.

వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను.

44నా స్వజనుల కలహాల్లో నుండి కూడా నీవు నన్నువిడిపించావు.

ప్రజల అధికారిగా నన్ను నిలిపావు.

నేను ఎరుగని ప్రజానీకం నన్ను సేవిస్తారు.

45పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు.

వారు నన్నుగూర్చి వింటే చాలు, నాకు విధేయులౌతారు.

46అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు.

47యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి.

నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక.

48ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు

జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.

49ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిస్తాడు.

నా మీద దాడి చేసే వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు.

హింసాత్మకుల నుండి నన్ను కాపాడుతావు.

50కాబట్టి యెహోవా, జాతుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ నామానికి స్తుతి పాడుతాను.

51తాను నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయాన్నిస్తాడు.

తాను అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిబంధన విశ్వసనీయత చూపే వాడు ఆయన.