Bible reader



1 సమూయేలు

గ్రంథకర్త

పుస్తకంలో రచయిత పేరు లేదు. దీన్ని సమూయేలు రాసి ఉండవచ్చు. అలాకాకున్నట్టయితే గ్రంథంలో 1:1 నుంచి 24:22 రాసి ఉన్న విషయాలకు అతడు సమాచారం అందించి ఉండవచ్చు. 1 సమూయేలు గ్రంథం సమూయేలు మరణం దాక వివరాలు వెల్లడిస్తున్న జీవిత చరిత్ర. ఇక్కడ చెప్పిన భాగాన్ని సమూయేలు రాసి ఉండవచ్చు. 1 సమూయేలు రచయితలు, సమాచారం అందించిన వారిలో ఒకవేళ ప్రవక్తలు, చరిత్రకారులు నాతాను, గాదు ఉండవచ్చు. (1 దిన 29:29).

రచనా కాలం, ప్రదేశం

ఇంచుమించు క్రీ. పూ. 1200 - 1000

మధ్యకాలంలో ఇశ్రాయేల్, యూదా రాజ్యాల మధ్య చీలిక ఏర్పడిన తరువాత ఈ పుస్తకం రాసి ఉండచ్చు. ఎందుకంటే ఈ రెండు రాజ్యాల పేర్లు ఈ గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి. (1 సమూ 11:8; 17:52; 18:16; 2 సమూ 5:5; 11:11; 12:8; 19:42-43; 24:1-9).

స్వీకర్త

ఈ గ్రంథం ప్రథమ పాఠకులు విభజన జరిగిన ఇశ్రాయేల్, యూదా రాజ్యల ప్రజలు. దావీదు రాజవంశం యొక్క ప్రాధాన్యత, ప్రయోజనాల గురించి దైవ సంబంధమైన దృక్పథం ప్రజలకు అవసరం.

ప్రయోజనం

కనానులో న్యాయాధిపతుల కాలం నుండి రాజుల పరిపాలనలోకి వచ్చిన ఇశ్రాయేల్ వారి చరిత్రను ఇది గ్రంథస్తం చేస్తున్నది. ఇందులో సమూయేలు చివరి న్యాయాధిపతిగా కనిపిస్తున్నాడు. మొదటి ఇద్దరు రాజులను కూడా అతడు అభిషేకించాడు.

ముఖ్యాంశం

మార్పు

విభాగాలు

1. సమూయేలు జీవితం, పరిచర్య — 1:1-8:22

2. ఇశ్రాయేల్ మొదటి రాజుగా సౌలు జీవితం — 9:1-12:25

3. రాజుగా సౌలు వైఫల్యం — 13:1-15:35

4. దావీదు జీవితం — 16:1-20:42

5. ఇశ్రాయేల్ రాజుగా దావీదు అనుభవాలు — 21:1-31:13